
తిరువనంతపుర: కేరళలోని సెంట్రల్ ఎక్సైజ్ విభాగానికి చెందిన ఉన్నతాధికారి ఇంట్లో మరణాలు మిస్టరీగా మారాయి. ఆయనతో పాటు తల్లి, సోదరి గురువారం అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించారు. మనీశ్ విజయ్ కొచ్చిలో సెంట్రల్ ఎక్సైజ్, జీఎస్టీ విభాగంలో అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆఫీసుకు నాలుగు రోజులు సెలవులు పెట్టారు. అవి పూర్తయిన తర్వాత కూడా ఆయన తిరిగి విధుల్లోకి రాలేదు. దీంతో మనీశ్ స్నేహితులు ఆందోళనకు గురై ఎర్నాకుళం జిల్లాలోని అతడి క్వార్టర్స్‌కు వెళ్లి చూశారు.
అక్కడికి వెళ్లగానే తీవ్రమైన దుర్వాసన రావడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు తీసి చూడగా మనీశ్, ఆయన సోదరి షాలిని వేర్వేరు గదుల్లో ఉరేసుకుని కనిపించారు. వారి తల్లి కూడా ఒక గదిలో మంచంపై నిర్జీవంగా పడి కనిపించింది. కొద్దిరోజుల క్రితమే వారు చనిపోయినట్టు కొచ్చి పోలీస్ కమిషనర్ మీడియాకు తెలిపారు. ఫొరెన్సిక్ పరీక్షల తర్వాత ఈ మరణాలకు కారణాలు తెలుస్తాయని చెప్పారు. అలాగే ఒక గదిలో డైరీని గుర్తించారు. విదేశాల్లో ఉన్న సోదరికి తమ మరణం గురించి సమాచారం ఇవ్వాలని, ఇంట్లో ఉన్న అన్ని పత్రాలను ఆమెకు అందించాలని కేరళ పోలీసులను ఉద్దేశించి అందులో పేర్కొన్నారు.